చంద్రబాబు ఒక కర్మ యోగి.. ఆయనలా ప్రతీ సీఎం పనిచేయాలి: బాబా రాందేవ్‌

  • ఉండవల్లిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై రాందేవ్‌ ప్రశంసలు
  • చంద్రబాబును యోగి, కర్మ యోగిగా అభివర్ణించిన యోగా గురువు
  • ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కితాబు
  • ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారిందన్న రాందేవ్‌
  • చంద్రబాబులాగే ప్రతీ ముఖ్యమంత్రి పనిచేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక యోగి, కర్మ యోగి అని, ఆయనలా దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి పనిచేస్తే 'వికసిత్ భారత్' లక్ష్యం 2047 కంటే ముందే సాకారం అవుతుందని యోగా గురువు బాబా రాందేవ్‌ ప్రశంసించారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద 'యోగాంధ్ర' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని, రాందేవ్‌ బాబా నిర్వహించిన యోగసాధనను ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా బాబా రాందేవ్‌ మాట్లాడుతూ.. "సీఎం చంద్రబాబు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు, కానీ నేను యోగా అతిథిగా వచ్చాను. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉండటం స్ఫూర్తిదాయకం. చంద్రబాబు అభివృద్ధి, దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి" అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన 'వికసిత్ భారత్', 'ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి లక్ష్యాల సాధనకు చంద్రబాబు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కొనియాడారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణంపై కూడా రాందేవ్‌ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారింది. ఈ రాజధానిని పచ్చదనంతో, అద్భుతమైన అందాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం స్విట్జర్లాండ్‌ను తలపిస్తోంది" అని కితాబిచ్చారు. అంతకుముందు ఉండవల్లి గుహల్లో కొలువైన పద్మనాభ స్వామిని దర్శించుకున్నానని, ఇక్కడి అరటి, మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, యోగా ప్రేమికుడు, సర్వజన ప్రేమికుడు అని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో రాందేవ్‌ బాబా తన శిష్యులతో కలిసి యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Chandrababu Naidu
Baba Ramdev
Yogandhra Amaravati
Andhra Pradesh CM
Viksit Bharat 2047
Yoga Guru Ramdev

More Telugu News